మూడు రోజుల కింద బెంగళూరులో తెలంగాణకు చెందిన జంట ఆత్మహత్య చేసుకున్న వార్త చదివా. అబ్బాయి హిందూ, అమ్మాయి ముస్లిం. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే. భర్త ఆత్మహత్య చేసుకుంది చూసి.. భార్య కూడా సూ*సైడ్ చేసుకుంది. సరే.. ఆ రోజుకు అది మర్చిపోయాను. కానీ దాని ఫాలోఅప్‌గా ఇండియా టుడేలో ఒక స్టోరీ వచ్చింది. అది చదివిన తర్వాత చాలా బాధేసింది. గుండెను పిండేసినంత బాధ. ఆ స్టోరీ చదువుతున్నంత సేపు.. నాకు వాళ్లిద్దరూ కళ్ల ముందు కనపడ్డారు. ఆ కథేంటో మీకూ చెప్తాను..
భాను చందర్ రెడ్డి, షాజియా.. ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఆ స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకునే వరకు వచ్చింది. కానీ వాళ్లద్దరి మతాలు వేరు కావడంతో, పెద్దలు ఒప్పుకోరని భయపడి ఆ విషయాన్ని 9 ఏళ్లుగా గుట్టుగానే ఉంచారు.
భాను కెరీర్ ఒకప్పుడు చాలా అద్భుతంగా ఉండేది. అమెరికాలో ఏకంగా కోటి రూపాయల ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసేవాడు. కానీ, AI రాకతో అతని కంపెనీలో లేఆఫ్స్ మొదలయ్యాయి. ఆ దెబ్బకు భాను ఉద్యోగం పోయింది. వేరే జాబ్ కోసం అమెరికాలో.. ఆ తర్వాత కెనడాలో తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో చేసేదేమీ లేక ఇండియాకు తిరిగి వచ్చేశాడు.
ఆ కష్టకాలంలో షాజియా అతనికి అండగా నిలబడింది. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే తను.. భాను కోసం బెంగళూరు వెళ్లింది. అక్కడే IBMలో జాబ్ తెచ్చుకుంది. ఇక అక్కడే కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలని చూసింది. కానీ భాను మాత్రం డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. ఒకవైపు ఉద్యోగం పోయిందన్న బాధ.. మరోవైపు పెళ్లి విషయం తెలిసి కన్నతల్లి తనతో మాట్లాడటం మానేసిందన్న వేదన.. అతన్ని మానసికంగా కుంగదీశాయి.
చివరికి ఆ డిప్రెషన్ మార్చి 30న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకునే వరకు దారితీసింది. 'నా భార్యకు న్యాయం చేయలేకపోయాను.. ఆమెను నా తల్లిదండ్రులకు గొప్పగా పరిచయం చేయలేకపోయాను' అని సూసైడ్ నోట్ రాసి భాను ఉరివేసుకున్నాడు.
భర్త శవాన్ని చూసిన షాజియా ఆ బాధను తట్టుకోలేకపోయింది. వెంటనే తన తల్లికి కాల్ చేసింది. కానీ ఆవిడ లిఫ్ట్ చేయలేదు. "అమ్మా, నేను పెళ్లి చేసుకున్నాను. నీకు అబద్ధం చెప్పాను, నన్ను క్షమించు" అని మెసేజ్ పెట్టి.. ఆ బిల్డింగ్ 17వ అంతస్తు నుంచి కిందకు దూకేసి తానూ ప్రాణాలు విడిచింది.
ఇక ఇంతకంటే పెద్ద విషాదం ఏంటంటే... పోస్ట్‌మార్టం తర్వాత వాళ్లిద్దరి డెడ్‌బాడీలను ఒకే అంబులెన్స్‌లో తీసుకెళ్తుంటే బంధువులు అభ్యంతరం చెప్పారట. అప్పుడు అక్కడున్న కొంత మంది.. "బతికున్నప్పుడు ఎలాగూ ఒకరికొకరు స్వేచ్ఛగా కలిసి ఉండలేకపోయారు.. కనీసం చావులో అయినా వారిని కలిసే వెళ్లనివ్వండి" అని చెప్పి ఒప్పించారు.
AI వల్ల వస్తున్న ఉద్యోగాల కోత, డిప్రెషన్, కులమతాల పట్టింపులు.. మనుషుల ప్రాణాలను ఎలా బలితీసుకుంటున్నాయో చెప్పడానికి ఈ జంట కథే ఒక ఉదాహరణ. మనకు కష్టం వచ్చినప్పుడు మనసువిప్పి మాట్లాడుకునే మనుషులు, మనల్ని అర్థం చేసుకునే కుటుంబం ఉండటం ఎంత అవసరమో కదా.